సహజత్వపు సమాధిపై నవీనతల పునాదులు
సంకర విత్తులతోనే సమృద్ధికి కసరత్తులు
అమూల్య సంపదలెన్నో అనాదిగా అందించే
పుడమి తల్లినల్లుకున్న సాంకేతిక లతాదులు
తరతరాల వరాలన్నీ తరిమేసిన ఆధునికులు
త్వరత్వరగా వినాశనం కోరుకునే అమాయకులు
పరమేశ్వర సృష్టినే పరిహసించు అయోగ్యులు
ప్రకృతి ఒడిలోఇమడలేని నవనాగరిక అభగ్యులు
శతాబ్ధాల క్రితం నాటి మేలురకం విత్తనాలు
సమూలంగ నశించీ కానరావు ఆనవాళ్లు
పరిస్థితులు చేయిదాటిపొయేలోపిన కళ్లు
తెరుచుకునీ, నిజాన్నికని మసలుకుంటే మేలు
కనిపెట్టిన వంగడాల ఘనతను పరిశీలిద్దాం..
నీటిఎద్దడోర్వలేవు, నేలసారమందుకోవు
ఎండవేడితాళలేవు ఎందుకూకొరగావు.
మూటలకొద్దీ ఎరువును కుమ్మరిస్తేగానీ
తెప్పరిల్లి తేరుకుని బ్రతికిబట్టకట్టలేవు.
ప్రతిసృష్టికి పూనుకున్న జన్యుశాస్త్రకోవిదులకు
నిరోధకతను కల్గినట్టి కొత్తరకం వంగడాల
పరిమాణం, రూపు, పంట దిగుబడులే లక్ష్యాలు
పరిశోధన విత్తనాలు ప్రజారోగ్య హార్యాలు
జన్యుసరళి సవరించిన బీజపు దేహంలో
అన్యజాతి అణుక్రమాన్ని జొప్పించటంలో
ఆరితేరినారు అవని శాస్త్రజ్ఞులెల్ల
వనమృగాలకు సైతం ఇదే రీతి పాటిస్తే
వానరాలు కరి ముఖంతో వస్తే ఆశ్చర్యమేమి?
ఆకారం మెండుకాని ఆరోగ్యాన్నిచ్చేవా?
రంగుల హంగులే కాని రుచుల ఆనవాలుందా?
విగ్రహం పుష్టి కాని విలువలేమొ గోవిందా!
చివరకు ఒక్కరికైన మక్కువ కాలేదుకదా
నాటు వాటి సాటి రాని నేటి పంటలు
అలనాటి మేటి ఉనికికి అంటించె మంటలు.
