Wednesday, 3 April 2013

శీతల పానీయాలు -- నా ఆవేదన

సీసాలో రంగునీళ్ళు, తియ్యనైన విషపుబొట్లు దిగమింగుతూ దిల్ మాంగే మోరందామా?
నిల్వఉన్న పుల్లనీళ్ళు,  చేవలేని చల్లనీళ్ళు గుటకేస్తూ మన దాహం తీర్చుకుందామా?
భారలోహభరితమైన క్షారాలతో మిళితమైన ఆమ్లవాయుపూరిత ద్రవమాస్వాదిద్దామా?
స్థూలకాయ ప్రదాయినిని దంతక్షయ కారిణిని అస్థిదృఢత హారిణిని ఏరికోరి కొందామా?
అరలక్షకోట్లనేటా పరదేశం తరలించే దౌర్జన్యంలో మనమూ భాగస్వాములవుదామా ?
దాహంతీర్చే సుధయని హాలాహలమమ్ముతుంటే నేత్ర యుక్త అంధులమై  నమ్మి మోసపోదామా?
మామిడిపళ్ళకు వేసవి (కానీ) 'మాజా' డ్రింకుకు కాదంట!!!!
కాలంతో పనిలేని కాలకూటమండోయ్! మరి మోజు పెంచుకుందామా?
లిమ్కా 7అప్ ఫాంటా  థమ్సప్ స్ప్రైట్ మిరిండా స్లైస్, - కోకోకోలా పెప్సిల మారువేషాలండి.
హోరెత్తించే ప్రచారజోరుకు కొట్టుకుపోక తేరుకుని నిజానిజం విశ్లేషించండి.
పర్యావరణం తనువూ ఆర్థికస్థితిగతులనూ చెరచే ఈ శీతలపానీయాలను మానండి.
పేదలకూ రైతులకూ అండగా నిలవండి.

కొబ్బరినీళ్ళూ మజ్జిగ నిమ్మరసం చెరుకురసం
తర్బూజాలు, బాదంపాలు ఎన్నిలేవు చెప్పండి.
పళ్ళరసం, పుచ్చకాయ, సగ్గుజావ, బార్లీలు, చోడంబలి,
ముంజలూ, బదనీరూ ఒంటికి మంచివి కావా ఆలోచించండి
వేసవి తాపాన్ని తీర్చు సరసమైన రసాలు
ఎన్నో మనకళ్ళ ముందు అందుబాటులో ఉండగా
ఏమీ పట్టనట్టు వ్యవహరించబోకండి.
మీకూ, మీ దేశానికి మేలు చేసేవాటికి బాసటగా నిలవండి.
స్వాభిమాన ధనులై సగర్వంగా మసలండి.